Type In Telugu
Article 1003


విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షంలో...   (Page 16 Of 16)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1283
Votes: 6  (Vote) Posted On 12/18/2011 @2:06:56 PM

15

"ఇనవంశాబుధి చంద్రమా! శశికళా హీనంబమావాస్య యా
మినియుంబోలిన యీ రథంబుపయి సామీ! నేనునై గుడ్ల గూ
బనుగాఁబోయిన, నయ్యయోధ్య ప్రజ నాపై రాలు రువ్వున్, ననుం
గొనవే నన్ను సుమిత్ర గర్భముగఁజేకోవే! దయాభావనా!"
(అయోధ్యాకాండ – ప్రస్థాన ఖండము)
        సీతారామలక్ష్మణులను శృంగిబేరపుర ప్రాంతానికి (గుహునిరాజ్యం) చేర్చిన తరువాత రాముడు సుమంత్రుని అయోధ్యకు తిరిగి వెళ్ళి పొమ్మన్నాడు. ఈ మాటను భరించలేని సుమంత్రుడు రామునితో అన్న మాట ఇది.

        "స్వామీ, రామయ్యా! నిన్ను వదలి, చంద్రుడు లేని అమావాస్య రాత్రి లాంటి ఈ రథంమీద నేను గుడ్ల గూబలా అయోధ్యకు వెడితే ప్రజలు నామీద రాళ్ళు రువ్వుతారయ్యా! నన్నుకూడా సౌమిత్రిగా భావించు. నీతోనే అరణ్యవాసం చేస్తాను" అని ప్రార్థించినా వినక, రాముడు ఆయనను అనునయించి పంపించాడు.

        దుఃఖంతో అయోధ్యకు వెళ్ళిన సుమంత్రుడు, దశరథునితో చెప్పుకొన్న వేదన హృదయవిదారకం –
"మహారాజా! సీతమ్మను, రామన్నను అడవిలో వదలి వస్తున్న నా దౌర్భాగ్య ముఖం చూడలేకనే కాబోలు – నీ రాజ్యంలోని చెరువులలో ఒక్క చేప కనిపించలేదు. తోటలలోని పూలపై ఒక్క తుమ్మెద కనిపించలేదు. పుర వీథుల్లో ఒక్క పురుగు లేదు. పచ్చిక బీళ్ళలో ఒక్క పశువు లేదు " అని మాత్రమే కాక,

        "కోప, శోకాలతో అయోధ్యా పౌరులందరు వీథి మొగం చూడక ఇళ్ళలోనే ఉండిపోయారు. నిర్జన వీథుల్లోంచి నా రథం వస్తూఉంటే, ఇళ్ళ తలుపుల సందుల్లోంచి పసిపిల్లలు చూస్తున్నారు. అపుడు ఆ పిల్లల తల్లులు వారిని వారిస్తూ, ఏమన్నారో తెలుసా ప్రభూ! అది రామయ్యను అడవిపాలు చేసి వస్తున్న పాపిష్టి కట్టెలబండిరా, దానిని చూడకూడదు!" అని! "భయంకరుడైన మాంత్రికుడెవడో కోపంతో రగిలిపోయి మంత్రిస్తే , కళ తప్పిన నీ రాజ్యం లోని ఊళ్ళను దాటుకుంటూ వచ్చాను" అని గుండెగూళ్లు కదలగా విలపించాడు.

        అపుడు దశరథుడు "సుమంత్రా! ఏ ప్రభువూ, ఏ మంత్రి చేతా చేయించని పనిని నీచేత నేను చేయించాను. నీవు చేసిన పని యాంత్రికం. రాజాజ్ఞగా నీవు చేసిన పని యొక్క పాపఫలం నీకు అంటదు. రాముణ్ణి అడవులలో నువ్వే దిగబెట్టాలని విధి నిర్ణయం. ఎవరికి ఏది వ్రాసిపెట్టి ఉంటుందో ఎలా చెప్పగలం ?" అన్నాడు.

View Comments(7)    Post a Comment    By - Ramakrishna Murty
 
      12  13  14  15  16         Page