"శ్రీ హనుమజ్జయంతి" సందర్భంగా మన అందరిపైనా శ్రీ ఆంజనేయస్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరించాలనీ, ఆ శ్రీరామ భక్తాగ్రేసరుడు మనందరికీ అండగా నిలిచి అన్ని బాధల నుండి రక్షణ కలిగించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. *** *** *** *** హనుమంతుని చరిత్ర ఇతివృత్తంగా కలిగిన గ్రంథాలు తెలుగులో తక్కువ. సంస్కృతభాషలో అగ్నిపురాణము, పద్మపురాణము, శివపురాణము, వాయుపురాణము, భవిష్యత్పురాణము, విష్ణుపురాణము, వాల్మీకిచే రచింపబడిన శ్రీమద్రామాయణము, పరాశరసంహిత, రామరహస్యోపనిషత్తు, మహాభారతము, భాగవతము, దేవీభాగవతము మున్నగు గ్రంథములు హనుమత్సంబంధమగు కథాంశములను కలిగియున్నవి. ఈ గ్రంథములు కొన్ని తెలుగులోకి అనువదింపబడ్డాయి. పుష్పగిరి తిమ్మన వ్రాసిన "సమీరకుమార విజయము" మాత్రము హనుమంతుని కథను తెలుపుటకే వెలసిన గ్రంథము. తిమ్మన ఇందులో తెలిపిన కథాంశములు ఏ, యే మూలగ్రంథముల నుండి గ్రహించినాడో ఆయన తెలుపలేదు ! రామాయణ రచయితలు శ్రీరామునికి ప్రాధాన్యమునిచ్చి వ్రాసియున్నారే కాని, హనుమంతునికి తగిన ప్రాధాన్యమును ఇవ్వలేదు. తమ కాలమునకు అనుగుణముగాను, తమ ప్రతిభకు తగినట్లుగాను వారు వాల్మీకి తెలుపని ఎన్నో అంశములను కల్పించినారు. హనుమంతుని రామకింకరునిగా, రామభక్తునిగా, రామదూతగా చిత్రించు ప్రయత్నమును చేసినారు కాని, బాల్యమాదిగా గల హనుమజ్జీవిత కథాంశములను వారు పేర్కొనలేదు. హనుమంతుని దైనందిన జీవిత ప్రతిక్షణానుభూతులనుగానీ, అతడు నివసించిన సమాజ స్వరూపమునుగానీ వారు ప్రతిపాదించలేదు. తమ కావ్య కళాధర్మమునకు తగినట్లుగా, కథావసరమును బట్టి కొంతవరకే హనుమంతుని పాత్రను మలచినారు. సూర్యభగవానుని వద్ద విద్యాభ్యాసము చేసి, మాతులుల (మేనమామల) వద్దకు చేరిన తర్వాత హనుమంతుని జీవితవిశేషముల గురించి ఏ గ్రంథములోను వివరముగా లేదు. అతని దైనందిన జీవితమూ, యౌవనమూ, ఆశలూ, అనుభూతులూ, తోటివారితోగానీ సమాజముతోగానీ అతనికి ఎలాంటి మమతానురాగాలు కలుగుచుండెనో ఏమాత్రము తెలియవు.
|
|