శీర్షిక చూడగానే బహుశా మీలో చాలామందికి ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు - 'అర్జునుడేమిటీ! అత్తను పెళ్ళి చేసుకోవడం ఏమిటీ!' అని. కొంతమందికి మరొక సందేహం కూడా వచ్చివుండవచ్చు - నేను ' శ్రీకృష్ణుడు ' అని వ్రాయబోయి, పొరపాటున ' అర్జునుడు ' అన్నానేమోనని!............ ఎందుకంటే, రాధాకృష్ణుల ప్రేమ జగద్విఖ్యాతం. ఐతే, రాధ గురించి లోకంలో కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె శ్రీకృష్ణుని పెంపుడుతండ్రియైన నందునికి చెల్లెలనీ, ఆ విధంగా కృష్ణునికి మేనత్త అనీ కొందరు అంటారు. మరికొందరేమో ఆమె గోకులంలోని ఒక గ్రామపెద్దయైన వృషభానుడు అనేవాడి కూతురని చెప్తారు. నిజానికి, ఈ రాధ పాత్ర వేదవ్యాసులవారి "సంస్కృత భాగవతం" లో కానీ, పోతనామాత్యులవారి "ఆంధ్ర మహా భాగవతం" లో కానీ లేనేలేదు! ఆ గ్రంథాల్లో మనకు ఎక్కడా కనిపించదు! ఈ విషయం చాలామందికి విస్మయం కలిగించవచ్చు. కాని, ఇది వాస్తవం. నాకు తెలిసినంతవరకు, రాధ పాత్రకు అజరామరమైన ఖ్యాతిని ఆర్జించి పెట్టినవాడు జయదేవ కవీంద్రుడు. ఆయన తన సంస్కృతకావ్యం "గీతగోవిందం" లో రాధాకృష్ణుల ప్రణయాన్నే ఇతివృత్తంగా స్వీకరించాడు. "గీతగోవిందం" కావ్యముతో పరిచయం లేనివారికి సైతం, అందులోని ' అష్టపదులు ' సుపరిచితాలే! కాకపోతే, అవి ఆ కావ్యంలోనివేనని వారికి తెలియకపోవచ్చు! జయదేవుని అష్టపదులు చాలా శ్రావ్యంగా, మధురాతిమధురంగా ఉంటాయి. "హరిరిహ ముగ్ధవధూ నికరే, సావిరహే తవ దీనా రాధా, ప్రియే! చారుశీలే!, ధీర సమీరే, యమునాతీరే" ఇత్యాదులన్నీ ఆ మహాకవి లేఖిని నుండి జాలువారిన అష్టపదులే!......... మొత్తం మీద రాధాకృష్ణుల ఆరాధన దక్షిణభారతదేశంలో కన్నా, ఉత్తరభారతంలో ఎక్కువ. నేను అసలు విషయం వదిలేసి ప్రక్కదారి పట్టినట్టున్నాను..... మరోసారి స్పష్టం చేస్తున్నాను - శీర్షికలో నేను ఉదహరించింది సాక్షాత్తూ పాండవమధ్యముడైన అర్జునుడినే అని! మరి, ఆయన తన అత్తను ఎప్పుడు వివాహం చేసుకున్నాడు?! ఇంతకీ, ఎవరావిడ?!!!........ మీలోని సాహితీపరులు కొందరైనా బహుశా ఈపాటికి ఊహించేవుంటారు.
|
|