Type In Telugu
Article 936


శ్రీకృష్ణుడు - శ్రీకృష్ణదేవరాయలు   (Page 1 Of 4)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1635
Votes: 4  (Vote) Posted On 10/10/2010 @5:31:45 PM

        ఇటీవలే శ్రీకృష్ణదేవరాయలవారి "పంచశత పట్టాభిషేక మహోత్సవాలు" మన దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో అత్యంత వైభవంగా జరిగాయి. ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగువారు, విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు సైతం ఈ సంబరాల్లో అత్యుత్సాహంగా పాలుపంచుకున్నారు.

        ఈ వసుధను ఎందరో చక్రవర్తులు, మరెందరో మహారాజులు పరిపాలించారు. ఐతే, వారికెవరికీ లభించని పై అపూర్వగౌరవం రాయలవారికి మాత్రమే దక్కింది...... పోతనామాత్యులవారు తమ "భాగవతము" లో "కారే రాజులు! రాజ్యముల్ గలుగవే! గర్వోన్నతిన్ బొందరే! వారేరీ? సిరి మూటఁ గట్టుకొని బోవంజాలిరే! భూమిపై పేరైనన్ గలదే!" అని బలిచక్రవర్తి ముఖతా చెప్పించారు. ఎంతమంది మహీపతులు ఈ పుడమిని ఏలినప్పటికీ, తెలుగుసాహిత్య పోషణలో కృష్ణదేవరాయలకు సాటి రాగలిగినవారు లేరు. అందుకే తెలుగుప్రజల హృదయాల్లో ఆయనకు అంత సుస్థిరస్థానం!

        "సాహితీ సమరాంగణ సార్వభౌముడు" గా రాణకెక్కిన రాయలవారు కవిపండితులను పోషించుట మాత్రమే కాదు; తాను స్వయంగా కూడా మంచి పాండితీప్రకర్ష కల కవిరాజు! ఆయన వెలయించిన "ఆముక్తమాల్యద" ప్రబంధం విద్వజ్జనుల ప్రశంసలను పొంది "ఆంధ్ర పంచకావ్యములు" లో అగ్రస్థానాన్ని అలంకరించింది. నిత్యమూ రాజ్యనిర్వహణ కార్యకలాపాలతో తలమునకలుగా ఉండే మహారాజు, అంతటి ప్రౌఢకావ్యాన్ని నిర్మించడమంటే మాటలు కాదు. నారికేళపాకములో ఉండే ఆయన శైలి సామాన్యపాఠకులకు కొరుకుడుపడదు. వ్యాఖ్యానగ్రంథాలను ప్రక్కన ఉంచుకుని పఠిస్తేనే "ఆముక్యమాల్యద" సౌరభాన్ని ఆఘ్రాణించగలుగుతాము.

        కృష్ణరాయల ఆస్థానములో అష్టదిగ్గజ కవీంద్రులు ఉండేవారని మనందరికీ తెలిసినదే! వారిలో "నంది తిమ్మన" ఒకరు. ఈ కవి మృదుమధురమైన ఫణితిలో "పారిజాతాపహరణము" కావ్యాన్ని రచించి, రాయలవారికి అంకితం చేశారు. ఈ కావ్య ' అవతారిక ' లో రాయలవారి గురించి తిమ్మన వ్రాసిన ఒక పద్యమును మీ ముందుకు తెస్తున్నాను. ఇందులో తిమ్మన రాయలకూ, శ్రీకృష్ణునికీ అభేదం చూపిస్తూ, ద్వాపరయుగంలో తనలోన కలిగివున్న కొన్ని దోషాలను సవరించుకొనడానికై సాక్షాత్తూ శ్రీకృష్ణుడే కలియుగంలో కృష్ణరాయలుగా జన్మించినాడని చెప్తున్నారు.


View Comments(12)    Post a Comment    By - Satyanarayana Piska
 
      1  2  3  4         Page