Type In Telugu
Article 957


గాలిపటం... గాలిపటం   (Page 1 Of 3)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1369
Votes: 2  (Vote) Posted On 1/13/2011 @12:24:33 AM

        సంక్రాంతి వచ్చేసింది. ఆడవాళ్ళంతా పొద్దున్నే లేచి రాత్రి కష్టపడి ప్రాక్టిసు చేసిన ముగ్గులు వేస్తున్నారు. పిల్లకాయలు తము కొనుక్కున్న గాలి పటాలన్ని లెక్కలుచూసుకుంటున్నారు. ఎవరిదగ్గర ఎంత మాంజా ఉందో, అది సరిపోతుందో లేదో, ఒకవేళ కొత్త మంజా కావాలంటే ఏ షాపు నుంచి తెచ్చుకోవాలో అని ఆలోచనలలో ఉన్నారు. మా ఆవిడ ఇచ్చిన వేడి కాఫీ తాగుతు పేపరు పట్టుకుని మధ్య మధ్యలో వాళ్ళ హడావుడి చూస్తు నేను. ఇల్లంతా పిల్లలతో వాళ్ళ ఫ్రండ్స్ తో కోలాహలంగా ఉంది. వాళ్ళ హడావుడి చూస్తుంటే ఎదో యుద్ధానికి వెళ్ళే సైన్యం లా అనిపించింది.

        "అవును మరి ఇది ఒకరకమైన యుద్ధమే కదా" అనుకున్నా మనసులో.

        ఒక్కసారి మనసులో నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ రోజుల్లో సంక్రాంతి అంటే ఎంత హడావుడి చేసేవాళ్ళమో. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలావరకు తగ్గిపోయింది అనిపించింది. "ధరలు బాబూ, ధరలు" అనుకున్నా నాకు నేనే నచ్చచెప్పుకున్నట్లు. ఇప్పటివాళ్ళకు ఆనాటి గాలిపటాల పేర్లైనా సరిగా తెలుసో లేదో. పతంగులు అనేవాళ్ళు.

        ఎన్ని రాకాల పేర్లు ఉండేవి? సరిగా గుర్తులేవు. నమందార్, జీబా, లంగోటి, గుడ్లందార్, బనియందార్, గుడ్డి లంగోటి, గిల్లోరాడప్పన్, డోరేదార్, అద్దా, ఇవి కొన్ని గుర్తున్నాయి. హ హ భలే పేర్లు. నామందార్ అన్నా జీబా అన్నా ఒకటే. పతంగి పైన ఒక నామం ఉంటుంది. లంగోటి అంటే పతంగి అడుగున ఒక చిన్న గౌనులాగా, గుడ్లందార్ అంటే రెండు కళ్ళు, బనియందార్ అంటే చారల పతంగి, గుడ్డి లంగోటి అంటే ఒంటికన్ను, కింద గౌను. గిల్లోరాడప్పన్ అంటే సరిగా గుర్తులేదు. దోరేదార్ అంటే పతంగి చుట్టురా కాగితానికి దారం పెట్టేవారు. అద్దా అంటే పెద్ద గాలిపటం.

        సంక్రాంతికి ఒక్కొక్కళ్ళకి పది రూపాయలు ఇచ్చేవారు నాన్న. నేను మా అన్నయ్య ఇద్దరం మా చెల్లెల్లకి మస్కా కొట్టి వాళ్ళ డబ్బులు కూడా స్వాహా చేసేవాళ్ళం. అది వేరే సంగతి అనుకొండి. పతంగుల ధరలు అతిచిన్న పతంగి ఒక పైసా, 3 పైసలకి మధ్యరకం, 5 పైసలకి కొంచం పెద్ద గాలిపటం వచ్చేవి. దోరేదార్ 10 పైసల నుండి మొదలయ్యేవి. అద్దా అటు ఇటుగా 50 పైసలు నుంచి రూపాయి ఉండేది. గీటీ మాంజా 10 పైసలు. గీటి దాదాపు 20 లచ్చాలు. అంటే అంగుష్టాం నుంచి చిటికిన వేలుకి మధ్య దారాన్ని 20 సార్లు చుట్టి ఇచ్చేవాళ్ళు. అప్పట్లో చార్మినార్ దగ్గర గుల్జారాస్ మాంజాలకి చాలా ప్రసిద్ధంగా ఉండేది. ఒక సాదా దారపు రీలు 50 పైసలుండేది. చరఖాలంటివి కొనేవాళ్ళం కాదు. మా ఇంట్లో పాత పాండ్స్ డబ్బాలకి చుట్టు వాడేవాళ్ళం.


View Comments(6)    Post a Comment    By - Devarakonda Subrahmanyam
 
      1  2  3         Page