Type In Telugu
Article 973


శివ ధనుర్భంగము   (Page 1 Of 4)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 2387
Votes: 8  (Vote) Posted On 4/11/2011 @9:41:48 PM

  అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు  

        త్వరలోనే మనం "శ్రీరామనవమి" పర్వదినమును జరుపుకోబోతున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని "శివ ధనుర్భంగము" గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం.

        "శ్రీమద్రామాయణము" ఆబాలగోపాలానికి ఆదరపాత్రమైన ఆదికావ్యము. అందులోనూ మన తెలుగువారికి సీతారాములు ఆరాధ్యదైవాలు. తెలుగునాడులో శ్రీరాముని గుడి లేని గ్రామం లేదు. తెలుగువాడు "శ్రీరామ" చుట్టకుండా ఏ వ్రాతా ప్రారంభించడు. మన గోదావరీతీరం సీతారాముల పవిత్ర పాదపరాగములతో పులకించిపోయింది. అందువల్లనే, రామకథ అంటే తెలుగువారికి అంతులేని అభిమానం. తెలుగుభాషలో ఉన్నన్ని రామాయణాలు, మరే ఇతరభాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు.

        "శ్రీరామనవమి"కి తెలుగునాట వాడవాడలా సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి, వారి వివాహం ఏవిధంగా సంభవించింది? స్వయంవర నియమం ప్రకారం రఘువీరుడు శివధనుస్సును ఎక్కుపెట్టి విరిచినందువల్లకదా!-------- ఈ శివధనుర్భంగ సన్నివేశాన్ని వివిధ కవులు తమతమ కావ్యాల్లో అద్భుతంగా వర్ణించారు. ఆ ఘట్టాన్ని కొంతమంది కవీశ్వరులు ఏవిధంగా మన ఎదుట రూపుకట్టించారో స్థూలంగా చెప్పడమే ఈనాటి ఈ వ్యాసము యొక్క ఉద్దేశ్యము.

        కవులలో ఎవరి శైలీవిన్యాసం వారికి ఉంటుంది.... ముందుగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు తమ "రామాయణ కల్పవృక్షము"లో ఈ సన్నివేశాన్ని ఎలా వర్ణించారో తెలుసుకుందాము. వారు ఈ సందర్భంగా ఆణిముత్యాల వంటి 2 పద్యములను మనకు అందించారు.

        అందులో మొదటి పద్యమును చిత్తగించండి.
నిష్ఠావర్ష దుదార మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికాయుగపదుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠ స్ఫూర్జథుషండ ఘుర్ఘుర రవాహీన క్రియాప్రౌఢి ద్రా
ఘిష్ఠమ్మై యొక రావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్


View Comments(8)    Post a Comment    By - Satyanarayana Piska
 
      1  2  3  4         Page