Type In Telugu
Article 991


అఖండ గౌతమీతీరంలో అపురూప కాలఖండం   (Page 1 Of 6)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1038
Votes: 5  (Vote) Posted On 9/17/2011 @10:00:00 AM


        నా కవితా సంకలనం "వెన్నెలలో వడగాడ్పులు" కు ముందుమాట వ్రాస్తూ మిత్రులు శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు... "మేమంతా కొవ్వూరు - ఆంధ్రగీర్వాణ విద్యాపీఠంలో చదువుకున్నాం. ఎవరు ఏమనుకున్నా నిజంగా అది మాకు గర్వకారణం. ఆ గీరతోనే బతికేస్తున్నాం. మాకు పాఠాలు చెప్పిన గురువులు అంతటివారు" అన్నారు. ఇది ఈ కళాశాలలో చదివిన అందరి మాటాను. కళాశాల శత వసంతోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ -వంద సంవత్సరాలలోనూ నేను చదివిన ఐదు సంవత్సరాల కాల ఖండాన్ని (1965-1970) స్మరించుకోవటం ఒక అమృతానుభవం.

సుమవజ్ర సమంచిత్తం, శిష్యవాత్సల్య శోభితం
సద్గురుం అప్పరాయాఖ్యం వందే సద్భావ సిద్ధయే
        అని గురుదేవులు, కళాప్రపూర్ణ శ్రీ కేశిరాజు వేంకట నృసింహ అప్పారావుగారికి ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. అకార, ఉకార, మకార సంయోగమే ప్రణవం అన్నట్టు, మాకు కొవ్వూరంటే - గోదావరి, ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం, అప్పారావుగారూను. అరిగిన గంధపుచెక్కలాంటి శరీరం, సింహగర్జనలాంటి కంఠస్వరం, వెన్ననూ, వజ్రపు పొడినీ రంగరించినట్లుండే సంభాషణం. మమతతో మందలించటం అంటే ఏమిటో మాస్టారి దగ్గరే చూడగలం. ఆయన కోపపు పరాకాష్ఠ "సన్యాసీ!" అనే పదంతో వ్యక్తమయ్యేది.

        తమ శిష్యులందరిమీదా తమ వ్యక్తిత్వ ప్రభావాన్ని ప్రసరింజేసినవారాయన. చదివిన చదువు సంస్కారాన్ని ఇవ్వకపోతే అది వ్యర్థ వ్యవసాయం అనేది ఆయన సందేశం. మా కళాశాలలో మూడు "సి" లు నిషిద్ధం అనేవారు. మూడు "సి" లు అంటే కాఫీ, సినిమా, సిగరెట్టు! ఆయన చేసిన నియమాలూ, పెట్టిన ఆంక్షలూ అప్పుడు మ్రింగుడు పడకపోయినా, కాలక్రమంలో వాటి ఆంతర్యం అవగతమై మా వృత్తులకూ, ప్రవృత్తులకూ ఒక విలువ దక్కింది. నిత్యపూజలో – సంకల్పం చెప్పుకొనేటప్పుడు గోత్ర నామంతోపాటు విద్యాపీఠనామాన్నికూడా చెప్పుకోవాలనేవారు.


View Comments(12)    Post a Comment    By - Ramakrishna Murty
 
      1  2  3  4  5         Page