Type In Telugu
Article 998


శ్రీ ఇంద్రగంటి హనుచ్ఛాస్త్రిగారి పద్యఖండికలు   (Page 1 Of 8)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1346
Votes: 5  (Vote) Posted On 11/13/2011 @11:26:17 AM

        ఆధునికాంధ్ర కవులలో శ్రీ ఇంద్రగంటి హనుచ్ఛాస్త్రిగారికి ఒక విశిష్టస్థానం ఉంది. జలసూత్రం రుక్మిణీ నాథశాస్త్రిగారు (జరుక్ శాస్త్రి) ఈయనను "హనుమదింద్రగంటి" అని ఒక సందర్భంలో వ్యవహరించారు. ఆ పేరు కూడా సాహితీబంధువులకు చిరపరిచితం.అనేక ప్రక్రియలలో వాసికెక్కిన రచనలు చేశారాయన. వారి "సృష్టిలో తీయనిది స్నేహమేనోయి" అనే పాటను ఏదో ఒక సందర్భంలో తలచుకోని తెలుగువారుండరు అనటం యధార్థోక్తి . శాస్త్రిగారి దక్షారామము, కీర్తితోరణము, గౌతమీగాథలు, కాళిదాస కళామందిరము, ఆరు యుగాల ఆంధ్రకవిత, ఇటీవల ప్రచురితమైన "సాహిత్య సంచారం" మొదలైన రచనలు సాహిత్యప్రియులకు అందిన అమృత ఫలాలు. ఆకాశవాణిలో శాస్త్రి గారు వ్రాసిన లలితగీతాలెన్నో ప్రముఖ గాయనీ, గాయకులు పాడగా ప్రసారమయ్యాయి. చిన్న కథకు "కథానిక" అనే పేరు సూచించినది శ్రీ శాస్త్రిగారే.

        ఈ సంవత్సరం శ్రీ శాస్త్రిగారి శతజయంతి సమాపనఉత్సవం ఎన్నో సాహిత్య సంస్థలు జరుపుతున్నాయి. వారు 1911, ఆగస్టు 29 వతేదీన విశాఖ జిల్లా "మాడుగుల"లో జన్మించారు. విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలోను, కొవ్వూరు "ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం"లోను "ఉభయభాషాప్రవీణ" చదివారు. 1987 నవంబరు 14 వతేదీన వరంగల్ లో పరమపదించారు.

        "హనుమదింద్రగంటి అసలు తత్త్వమ్మెదో చెప్పగలుగువాడు గొప్పవాడు" అని ఒకమిత్రుడు అంటూ ఉండేవాడు. ఇది యధార్థమే. ఎందువల్లనంటే – శాస్త్రిగారు తమ సువిశాల కవితాభవనంలోకి అన్ని దిశలనుంచీ సత్య, శివ, సుందరాలైన భావ సమీరాలను ఆహ్వానించారు. ఒకే వస్తువుకు, నినాదానికి, ఒక కూటమికి ఆయనెప్పుడూ పరిమితంకాలేదు. వాల్మీకి, కాళిదాసు, భాసుడు, భవభూతి మొదలైన సంస్కృతకవులను, నన్నయ, శ్రీనాథాది ప్రాచీనాంధ్ర కవులను, రాయప్రోలు, కృష్ణశాస్త్రి మొదలైన భావకవులను, శ్రీశ్రీ, ఆరుద్రమొదలైన ఆధునిక అభ్యుదయ కవులను - "కవితాజీవాంశ" ప్రాతిపదికగా, ప్రమాణంగా ఆయన అభిమానించారు. ఆయా కవులకావ్యాలపై వ్యాఖ్యలు, వ్యాసాలు వ్రాశారు. నవ్య కవితోద్యమాలపై విజృంభించిన విమర్శలకు సమర్థవంతంగా ప్రామాణికమైన సమాధానాలూ చెప్పారు. ఎన్నో ప్రక్రియలనూ తమ రచనలతో సుసంపన్నం చేశారు. అట్టమీద పేరు లేకపోయినా "ఇది హనుచ్ఛాస్త్రిగారి ముద్ర" అని పోల్చుకోగలిగిన విశిష్టశైలి వారిది.


View Comments(4)    Post a Comment    By - Ramakrishna Murty
 
      1  2  3  4  5         Page